కాలిఫోర్నియా: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారులకు ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. ఈ ఏడాదిలోనే తన సొంత ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. అలాగే 2021 నాటికి తొలి ఆపిల్ బ్రాండెడ్ ఫిజికల్ స్టోర్ ఏర్పాటు కానుందని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఎట్టకేలకు భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్‌లైన్‌లోనే ఐఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది.
కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాన్ని టిమ్ కుక్ వెల్లడించారు. దేశీయ భాగస్వామితో కాకుండా తామే స్వయంగా స్టోర్‌ను ప్రారంభించాలని చూస్తున్నామని, దీనికి సంబంధించిన అనుమతులను భారత ప్రభుత్వం నుండి పొందాల్సి వుందని కుక్ చెప్పారు. తమ బ్రాండ్‌ను మరెవరో నడపాలని తాను కోరుకోవడంలేదన్నారు. అంతేకాదు తమకు భారత్ చాలా కీలకమై మార్కెట్ అని గట్టిగా విశ్వసించే కుక్ 2020 జూన్, జూలై మధ్య ఇండియాలో పర్యటించనున్నారు. భారత్‌లో వ్యాపారం, తయారీ ప్రణాళికలు, ఎగుమతులు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆపిల్ దుకాణాల విస్తరణతో సహా పలు అంశాలను ఆయన పరిశీలించనున్నారు. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనల సడలింపుల నేపథ్యంలో 2020 జనవరి, మార్చి మధ్య ఆపిల్ తన మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించనుందని అంచనాలొచ్చాయి. అయితే లాజిస్టికల్ సమస్యలతో ఈ ప్రయత్నాలను వాయిదా వేసినట్టు పలు అంచనాలు వెలువడ్డాయి. (చదవండి : శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్)